ఒక కుర్రాడి ప్రశ్న
ఒక చదువుకుంటున్న కుర్రాడు నా దగ్గరకు వచ్చాడు. మాస్టారు, మీరు ధర్మం, ధర్మం అంటారు, మా బడిలో అది నేర్పలేదు, కళాశాలలో అది నేర్పలేదు. దాని అవసరం ఏముంది ఇంక అన్నాడు!
పరిశీలన , వాస్తవికత
మనతో పాటు వున్నది 7 వేల మంది(జనవరి 2024 లో), అందులో బహుశా నా పోస్టులు ఒక 500 మంది చూస్తారు, ఒక వంద మందికి తెలుసుకున్నందుకు వారికి నచ్చచ్చు, అందులో 10-15 మంది “నచ్చింది” అని చెప్తారు, ఒక 5-10 మంది ఇతరులతో పంచుకోటానికి ఉత్సాహం చూపిస్తారు. టూకీగా, నేను చెప్పేది 100 మందికి హృదయానికి చేరుతుంది అనుకుందాం. అంటే 100/7000 = 1.4% (అది కూడా మనతో వున్న వాళ్ళల్లో)
ఇప్పుడు ఈ వంద మంది, మరి కొంత మంది జ్ఞానులు వారి శిష్యులు ఒక పది లక్షల మంది వేసుకుందామా? ఉన్న మన దేశ జనాభాలో, 0.7% అంటే ఒక్క శాతం కూడా కాదు. ఒక్క శాతం జనాభాకి కూడా ధర్మం, దాని విలువ తెలియదు. ధర్మానానికి, నీతికి, మంచి తనానికి తేడా తెలియదు. ఎందుకంటే ఎవరు నేర్పలేదు! ఇక సమాధానం చదవండి!
ధర్మం, దాని విలువ, పాఠశాలలో, కళాశాలల్లో ఎందుకు నేర్పరు, అవసరమా?
మా ఇంటి పక్క ఒక ఇద్దరు పిల్లలు ఉండేవారు. అబ్బాయికి మూడేళ్లు, అమ్మాయికి నాలుగేళ్లు. వాళ్ళింటికి వెళ్తే, బిస్కట్ పేకట్టొ , చాకలేట్లో పట్టుకెళ్లే వాడిని. అమ్మాయి నవ్వుతు ఎదురొచ్చేది, దాని చేతిలో బిస్కట్ పెట్టి, పిల్లాడి చేతిలో చాకలేట్ పెడితే, వాడు దాని చేతిలోది కూడా లాగేసుకునేవాడు. పిల్ల పాపం వెర్రి మొహం వేసేది. ప్రతి మనిషికి బ్రతకటానికి కొంత స్వార్ధం ఉంటుంది, అది స్వధర్మం. అది మీరితే స్వార్ధం. మరి పిల్లాడికి లాక్కోవాలని, పిల్లకి, పెద్దదైనా లాక్కోకూడదని, ఎలా తెలుసు, దానిని వాసనలు అంటాం, పూర్వ జన్మ నుంచి వస్తాయి, కొన్ని తలిదండ్రుల నుంచి అబ్బుతాయి. అది ప్రక్రుతి పనిచేసే ధర్మం.
వీళ్ళిద్దరిని ఒక బడిలో వేసారనుకోండి, వీళ్ళ వాసనల వలన అలాగే ప్రవర్తిస్తారు. కిటుకు తెలిస్తే, పిల్లల్ని ఎలా మార్చుకోవాలి అనేది తెలుస్తుంది. లేకపోతె, దండన మాత్రమే ఉపయోగిస్తాము. రేపు మూడో పిల్లాడు పుట్టేప్పుడు, మనం ఏ జాగ్రత్త పడితే, మంచి సంస్కారాలు, వాసనలు వున్నా పిల్లడు పుడతాడో తెలుస్తుంది. బడిలో, ఆసుపత్రిలో, ఇవి చెప్పరు , ఆరోగ్యం వరకే చెప్తారు!
ఇప్పుడు మరో సన్నివేశం ఏంటంటే, నా చిన్న తనంలో, మా ఇంటి పక్కన ఒక “అమితాబచ్చన్” లా కనిపించే ఒక నవాబు వుండే వారు, మంచి వారు. పిల్లలంటే ఆయనకు చాలా ఇష్టం, నేను కూడా చాలా సార్లు వాళ్ళింట్లో ఆడుకునే వాడిని. అప్పుడప్పుడు సినిమా కూడా తీసుకెళ్లే వారు. ఆయన నాతొ సన్నిహితంగా ఉండటం చూసిన మా స్నేహితులు, నన్ను ఆట పట్టించేవాళ్ళు, “ఎం, అమితాబచ్చన్ ఎం చేస్తున్నాడు”, “ఈ సారి ఏ సినిమా చేస్తున్నాడు” ఇలా.. నేను ఆయనంటే ఇష్టం చేత, ఆయనలా మాట్లాడటం, అయన నడక అనుకరించటం జరిగేది. బహుశా, పిల్లలను ఇష్టపడటం అనేది ఆయన నుంచి నాకు కొంత వచ్చింది అనుకోవచ్చు!
అలాగే, మరో జరిగిన సంఘటన, నా యూనివర్సిటీ లో ఒక చిరంజీవి ఫ్యాన్ ఉండేవాడు, చాలా మంచి వాడు, కానీ చిరంజీవి అంటే మహా పిచ్చి, సినిమా 10 సార్లు చూసేవాడు. అతనికి తెలియకుండానే, చిరంజీవిలా నడవటం, ముఖ కవళికలు, చేతి, కాళ్ళ కదలికలు, మాట్లాడటం చేసేవాడు. ఆఖరికి పళ్ళు తోముకోవటం కూడా అలానే ఉండేది. అది మొదట్లో వినోదంగా వున్నా, రాను రాను ఒక పిచ్చివాడని చూసినట్లు గా ఉండేది. (సినిమా ఎఫక్ట్ చూడండి మనిషి పైన, అందుకే ఫ్యాన్ అవకండి, ఎవరికీ)
బడిలో నేర్పటానికి, వాళ్ళకి మొదట తెలియాలి కదా? వాళ్లకే తెలియవు. ఇక మేధావులు, మాకు అన్ని తెలుసు అని విర్ర వీగుతుంటారు. అవును వీళ్ళకి అన్ని తెలుసు కానీ దూర దృష్టి లేదు, ఒక్క ఉన్న చోటు, సమయం గురించి మొత్తం తెలుసు, అది దాటితే ఏమి తెలియదు. అందుకే వీళ్లు రాసే సిలబస్ లో ధర్మం ఉండదు!
ఏమి నేర్చుకుంటే ఏమవుతుంది, నేర్చుకోక పొతే ఏమవుతుంది
కాబట్టి, మీరు బడిలో నేర్చుకున్నవి మాత్రమే ఉపయోగిస్తే, మీరు యాంత్రికం. మీ మనస్స్సు, కోరికలు చెప్పినట్టు యథేచ్ఛగా ప్రవర్తిస్తే, మీరు అమానుషులుగా మారతారు! మీరు యాంత్రికంగా బ్రతకటానికి ఎంత ప్రయత్నించినా, మీ మనస్సు కోరికల వలన అమానుషత్వం కేసి పెరుగెట్టిస్తుంది. మీరు చేసే పనిని వీక్షించే వాళ్ళు, మీకు తెలియకుండా అనుకరించే వాళ్ళు, నాలాగ, నా స్నేహితుడి లాగ అనేకులు! వారే సమాజం లో అధికులు. ప్రపంచంలో మీరు యాంత్రికంగా పని చేయాలనుకుంటున్నారా, లేక ఒక మనిషిగానా అనేది ఒక పెద్ద ప్రశ్న, ఎంపిక.మనిషి ప్రవర్తన కోసం, ఏ పాఠ్యాంశాలు, ఒకవేళ వున్నా, చట్టాల పరిధిలో ఎలా ఉండాలో చెప్తాయి, చట్టాల పరిధిలో మాత్రమే వ్యవహరిస్తే, ఎలా వుంటారు మనుషులు, మొన్న ఒక విషయం చెప్పాను(వృత్తం కూడా చూపాను).మరి మనిషిగా బ్రతకాలంటే తెలియాల్సింది ఏమిటి, ధర్మం. ఇది ఏ నాయకుడు చెప్పలేక పోతున్నాడు, ఏ జ్ఞాని, నొక్కి వక్కాణించట్లేదు. ఏ మేధావి, సైకాలజిస్ట్, గట్టిగా మాట్లాడట్లేదు.
ప్రకృతిలో, ఏది ఎలా పని చేస్తుంది, ఎంతకాలం పని చేస్తుంది. ఏది చేస్తే రాబోయే తరాలు వక్రీకరించి బడతాయి, ఏది దేనితో ముడి పడి వుంది, ఏది ఎంతవరకు చేయాలి, ఏది చేయకూడదు, చేస్తే ఏమవుతుంది, అనేది తెలుసుకుంటే, మీరు సునాయాసంగా, హాయిగా, ప్రేమతో, రాపిడి లేకుండా, వేరే ప్రాణుల్ని ద్వేషించకుండా, పని చేయగలరు, జీవితాన్ని ఆస్వాదించగలరు. అదే మానవతా లక్షణం! ఇది కావాలంటే, అనుక్షణం ధర్మం తెలుసుకునే ప్రయత్నం చేయాలి.
నాకూ అన్ని తెలియవు, ప్రతి రోజు, నేర్చుకునే రోజు, నిన్నటికంటే ఉన్నతమైన మనిషిగా తయారయ్యే రోజు. మనిషిగా బ్రతకాలా, అమానుషంగా బ్రతకాలా, యాంత్రికంగా బ్రతకాలా అనేవి మనకున్న ఎంపికలు. ఏది ఎంచుకున్నారు మీరు ? చదువు మాత్రమే సరిపోదు మిత్రమా, మేధావి అయినంత మాత్రాన జీవితం, సమాజం సుగమం కాదు!
పరీక్షలకు 5 సెట్లు పేపర్లా? సెంటర్ మార్పిడా? అంటే అర్ధం, ఎక్కువ శాతం దొంగలకు శిక్షణ ఇస్తున్నామా?
99 శాతం మందికి ధర్మం తెలియకే భూమి అగ్నిగుండంగా, రక్త సిక్తంగా, మోస పూరితంగా, దొంగల మయంగా వుంది!